09 డిసెంబర్ 2011

పరమార్థం – తెంచుకోవడంలోనే!


పదహారో వసంతంలో పుట్టే  పరువపు ఆకర్షణ కాదిది!
ఒకరి శ్వాసలు మరొకరికి తగిలేంతదూరాల్లో దగ్గఱైనవేళ
మైమరచి పరవశించే పాతిక వయసూ కాదిది!
బ్రతుకు సూరీడు పడమటికి పరుగులు తీస్తున్న ప్రాయమిది!

పిలవని చుట్టంలా -
ఏదీకాని ప్రాయంలో ఎందుకొచ్చినదో తెలియని బంధమిది!

జీవితాన్ని సుప్తావస్థలో జీవించిన మన మనసులను
హఠాత్తుగా జాగృతస్థితిలోకి చేర్చిన నిముషమేదో.

ఏడాదంతా వేసంగితో శపించబడిన జీవితాల్లోకి
నిత్య శీతాకాలం చొరబడిన నిముషమేదో తెలియదు.

చీకట్లు నిట్టూర్చిన జీవితాల్లోకి - పండు వెన్నెలలు!
కలతల మేఘాలు కమ్మిన ఆకాశానికి - అరుణతేజం!

అభిరుచులు కలవడంతో ఇది ఆరంభం!

మన ఇద్దరికీ లింగభేదంలేకుంటే -
ఈ బంధం చిక్కటి స్నేహమై ఆదర్శమయ్యేది
ఇప్పుడిది స్నేహమైతే కాదు; ప్రేమ అంతకంటే కాదు
రెంటికీమధ్య పేరులేనిది!

జంటకట్టుకుని స్వతంత్రపు ఆకాశాన్ని ఆస్వాదించలేము
చెట్టాపట్టాలేసుకుని ప్రపంచం మరచి పరుగిడలేము
సంప్రదాయపు పంజరాల్లో బంధింపబడ్డ పక్షులం!

నా జీవితవీణలో నీ రాక ఏ తీగను మీటిందో
నిత్యం నాకు ఆనందభైరవి రాగాలే!
నీ బ్రతుకు ఎడారిపై ఏ అమృత చినుకులు కురిపించానో
నిత్యం నీ మనోవనంలో వసంతాలే!

నువ్వుమీటిన రాగాలతో నా జీవితమూ
నా ప్రవాహంతో నీ జీవితమూ - పరమార్థమైనవి!

కాలం పదేళ్ళు ఆలస్యం చేసింది,
మనల్ని పరిచయం చేయడంలో!
మన కుటుంబాలకొరకు ఈ బంధాన్ని
తెంచుకోడానికి మనం ఆలస్యం చెయ్యొద్దు!

==============================

P.S ఏడాది క్రితం రాసిన కవిత ఇది. తెలిసిన ఒక పెద్దాయన చెప్పిన తన కన్నీటి కథను కవితగా రాశాను.

16 నవంబర్ 2011

సూర్యనారాయణకి పదోతరగతిలో జ్వరం వచ్చింది...

సూర్యనారాయణకి పదోతరగతిలో జ్వరం వచ్చింది...
సంఘటనా కాలం: 1992-93

మన భారతదేశంలో విద్యార్థులకు పదవతరగతిలో వచ్చే ఫలితాలనుబట్టి వాళ్ళ బ్రతుకు మలుపు తిరుగుతుంది. బడికెళ్ళకపోయినా మంచి మార్కులు వస్తాయేమోగానీ, ప్రైవేటు ట్యూషన్‌కువెళ్ళి చదువుకోకుంటే మార్కులు రావు అన్నది జనం విశ్వాసం. అందులోనూ  నేను చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల! మంచి ఉపాధ్యాయులున్నా బడిలోచెప్పే చదువులు ఏం సరిపోతాయిలే అనే భావం ఉండేది తల్లిదండ్రులకు. అందరూ తమ పిల్లల్ని ప్రైవేటు ట్యూషన్లకు పంపుతున్నారు, మనం పంపకుంటే మార్కులు రావేమోనన్న భయంతో నన్నుకూడా ట్యూషన్లో చేర్చాలని నిర్ణయించుకున్నారు మా అమ్మా నాన్నలు. నాకు ప్రైవేటూ క్లాసులు అవసరంలేదు, బడిలో చేప్పేది చాలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

మా స్కూల్లో పదవతరగతి వరకు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే క్లాసులోనే ఉంచేవారు. పది రాగానే “ఏ” మరియూ “బీ” సెక్షన్లలో ఉన్న అబ్బాయిలందరినీ ఒక క్లాస్‌గానూ, అమ్మాయిలందరినీ మరొక క్లాస్‌గానూ విడదీసి "బాయ్స్" సెక్షన్, "గర్ల్స్" సెక్షన్ గా పెట్టేశారు మా బడి హెడ్మాస్టర్ గారు! అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే క్లాస్‌లో ఉంటే సరిగ్గా చదువుకోరు అనుకున్నారో  ఏంటో మరి! లెక్కలూ(మ్యాథ్స్), విజ్ఞాన శాస్త్రమూ(సైన్స్) అబ్బాయిలకు కేశవన్ మాస్టారు, అమ్మాయిలకి వేంకటేశరెడ్డి మాస్టారు నేర్పేవారు. ఇద్దరూ బడిలో నేర్పడమే కాకుండా తమ తమ ఇంటి వద్ద డబ్బులు తీసుకుని ప్రైవేటు ట్యూషన్లు నేర్పేవారు. వెంకటేశరెడ్డి గారు మా నాన్నకి బాగా పరిచయం. వాళ్ల పిల్లలు పుట్టినప్పుడు జాతకాలు రాయించుకోడానికీ, బారసాల చెయ్యడానికీ, వాహనం కొనడానికి మంచిదినం చూసుకోడానికీ, తన నక్షత్రానికి ఏ రంగు వాహనమైతే మంచిదో తెలుసుకోడానికీ ఇలా అన్నిటికీ మా నాన్న జ్యోతిష్యం చూసి చెప్పందే ఏ పనీ చెయ్యరు వెంకటేశరెడ్డి మాస్టారు. 

అబ్బాయిలు కేశవన్ మాస్టారు దగ్గరా, అమ్మాయిలు వెంకటేశరెడ్డి మాస్టారు దగ్గరా ప్రైవేటు ట్యూషన్‌కి చేరారు. ఈ వెంకటేశరెడ్డి గారు మా నాన్నకి పరిచయస్తుడు గనుక నాకు తప్పలేదు. అక్కడ అందరూ అమ్మాయిలే. ఒక్కణ్ణే అబ్బాయిని. ఇరవైనాలుగుమంది అమ్మాయిల గోల; రెండురోజులకే చిరాకనిపించింది. మూడోరోజు నా ఫ్రెండ్ కొల్లి మూర్తి గాణ్ణి ఏదోక విధంగా ఒప్పించి నాతోబాటు ప్రైవేటుకి చేర్పించేశాను. 

మాస్టారు వాళ్ళ ఇంటి డాబామీద ఒక పెద్ద షెడ్ ఉండేది. అక్కడ ఉదయం 7:30 మొదలవుతుంది ప్రవేటు క్లాసు. 9:30 వరకు జరిగేది. 10కి బడి. బడి నాలుగునిముషాల నడకదూరమే. మళ్ళీ సాయంత్రం 4:30 కి బడి అవ్వగానే 5:30కి  ప్రైవేటు క్లాసు మొదలైయ్యేది; 6:30 వరకు ఉండేది. ప్రైవేట్లో ఈయన ఒక్కరే ఒక్క తమిళం తప్ప మిగిలిన అన్ని సబ్జక్ట్లూ (లెక్కలు, సైన్సు, సోషల్ సైన్సు, ఇంగ్లీష్ గ్రామర్) నేర్పేవారు. శని-ఆదివారాల్లో ప్రైవేటు క్లాసు ఉదయం 8:00 నుండి 11 వరకు ఉండేది. అవసరమయితే మళ్ళీ సాయంత్రం ఉండేది. మాస్టారు మా నాన్నకు ఫ్రెండ్ గనుక నాకు ఎక్కువ చనువు ఉండేది. చదువు చెప్పడమే కాకుండా కొన్ని సమయాల్లో వాళ్ళ ఇంటి పనులు కూడా చెప్పేవారు నాకు(అంటే అంగటికెళ్ళి ఏదైనా కొనుక్కురావడం వంటివి). 

ఇలా సాగుతుండగా త్రైమాసిక పరీక్షల అనంతరం ఒకరోజు ఉదయం మాస్టారు పాఠాలు చెప్తున్నారు. ఒక అమ్మాయి వాళ్ళ నాన్న గారు వచ్చారు. ప్రైవేటు చదివిస్తున్నా వాళ్ళ అమ్మాయికి లెక్కల్లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయో కనుక్కోడానికి. ఆయన ఆ ఊరి టెలిఫోన్ ఎక్చేంజ్ లో(ఇప్పటి B.S.N.L) అసిస్టంట్ ఇంజినీరు. వాళ్ళ అమ్మాయి పేరు స్వప్న. చదువుల్లో ఆవరేజ్(Average) స్టూడంట్. మాస్టారు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి, ప్రైవేటు క్లాసులో మరో అర్థగంట ఎక్కువ సమయం స్వప్న కి లెక్కలు నేర్పించి తరువాయి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చి పంపించారు. ఆ రోజు ప్రైవేటు క్లాసు అవ్వగానే నన్ను ఆగమన్నారు. అందరూ వెళ్ళగానే, "సూర్యా, రేపట్నుండి రోజూ 7కి  వచ్చి స్వప్న కి లెక్కలు నేర్పించు" అని కొత్త డ్యూటీ అంటగట్టారు. అన్ని కష్టాలూ నాకే వచ్చిపడ్డాయి; తప్పలేదు నాకు! రోజూ తొందరగా వచ్చి ఆ ఇంజినీర్ గారి అమ్మాయి స్వప్న కి లెక్కలు నేర్పించేవాణ్ణి.

ఇలా కాలం నడుస్తుండగా మధ్యసంవత్సర పరీక్షలు కూడా అయిపోయాయి. పరీక్షలు అయిన మరుసటి రోజు శనివారం. ప్రైవేట్ క్లాస్ అవ్వగానే, మాస్టారు "సూర్యా, నువ్విప్పుడే ఇంటికి వెళ్ళకు. ఇక్కడే ఉండు. నువ్వు లేట్ గా ఇంటికి వస్తున్నట్టు మూర్తీతో మీ ఇంటికి కబురు పంపించు" అన్నారు. అందరూ వెళ్ళాక ఆన్సర్ పేపర్ల కట్ట చేతికిచ్చి "ఇవన్నీ దిద్దేసి వెళ్ళు. మధ్యాహ్నం ఇక్కడే భోంచేసేయ్" అన్నారు. 

సరే అని ఆ లెక్కల(Mathematics) ఆన్సర్ పేపర్లు దిద్దటం మొదలుపెట్టాను. దిద్దుతుండగా మధ్యలో ఈ స్వప్న ఆన్సర్ పేపర్ వచ్చింది. నేను నేర్పినవేమి సరిగ్గా రాయలేదు. గ్రాఫ్ కూడా గియ్యలేదు. ఎంత కష్టపడి మార్కులు వేద్దామన్నా 45 మార్కులకు దాటడంలేదు! ఈ సారీ మార్కులు తక్కువొస్తే వాళ్ళ నాన్న ఇక్కడికొచ్చి మాస్టార్ని సంజాయిషీ చెప్పమంటాడు అనుకొని ఒక ఉపాయం కనిపెట్టాను. ఆన్సర్ పేపర్లలో ఖాళీగా ఉన్న పేజీలలో ఆ అమ్మాయి రాయని లెక్కల ప్రశ్నలకు నేను జవాబు రాసి మార్కులేసేశాను! అంతటితో ఆపకుండా నా నోట్ బుక్ నుండి ఒక గ్రాఫ్ పేపర్ తీసి, గ్రాఫ్ గీసి ఆ ఆన్సర్ పేపర్తో జతకలిపి, 65 మార్కులదగ్గరకు తీసుకొచ్చేశాను. ఆ సాయంత్రానికి 30 పేపర్లూ దిద్ది ఇంటికెళ్ళాను. మరుసటి రోజు ఆదివారం ప్రైవేటు క్లాసులో మాస్టారు అక్కడున్న 24 మంది అమ్మాయిలకు మాత్రం వాళ్ళ ఆన్సర్ పేపర్లు అందించారు. 

అందరూ వాళ్ళ వాళ్ళ మారుకులు చూసుకుని, దిద్దడంలో ఏమైనా పొరపాట్లున్నాయేమో చూసుకుని పేపర్ తిరిగిచ్చేస్తున్నారు. మన జీనియస్ స్వప్న నిజాయితీగా మాస్టార్ దగ్గరకు వెళ్ళి "సార్, నేను గ్రాఫ్ గియ్యలేదు, సార్. నా పేపర్లతోబాటు ఈ గ్రాఫ్ పేపర్ కూడా ఉంది. ఇది నాది కాదు" అంది. నాకు పైప్రాణాలు పైపైనే పోయాయి. గుండె సెకండుకే వందసార్లు కొట్టుకోడం మొదలుపెట్టింది. ఇక నేను అయిపోయాను అనుకున్నాను. మాస్టారు ఆ గ్రాఫ్ పేపర్ చూశారు. ఆ అమ్మాయిని “వెళ్ళి కూర్చో నేను చూస్తాలే” అని పేపర్ తీసిపెట్టేసుకున్నారు. ఆ రోజు క్లాస్ అవ్వగానే త్వర త్వరగా వెళ్ళిపోవాలని చూస్తున్న నావైపుచూసి "సుర్యా, నువ్వు ఆగు" అన్నారు.

నాకు గుండెలో దడ ఇంకా ఎక్కువైపోయింది.  అందరూ వెళ్ళాక ఆ పేపర్ తీసుకుని "ఏంటీ పని? మీ నాన్నకోసం నిన్ను అమ్మాయిలు చదివే ప్రైవేటు క్లాసులో చేర్పించుకున్నాను. బాగా చదువుతావు, మంచి గుణాలుకూడా ఉంటాయి అనుకుంటే నువ్వు చేసిన పని ఇదా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ ఊళ్ళో ఇంజినీరు. ఇళ్ళకు ఫోన్ కనెక్షన్లు రావాలంటే ఆయన సంతకంలేందే రాదు" అని లింకులులేకుండా మాట్లాడుతున్నారు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ గ్రాఫ్ పేపర్ తీసేసి ఆ ఆన్సర్ పేపర్లో 5 మార్కులు తగ్గించి 60 మార్కులుగా దిద్ది పక్కన పెట్టారు. నేను అప్పటికీ నుల్చుని చూస్తూనే ఉన్నాను. "త్రైమాసిక పరీక్షలో 40 మార్కులు తెచ్చుకున్న అమ్మాయి నీ వల్ల  60 మార్కులు తెచ్చుకుంది. ఫైనల్ పరీక్షలో 80 మార్కులు తెచ్చుకోవాలి అలా నేర్పించు పో" అన్నారు. 

మరుసటి రోజు స్వప్న కి నిన్న జరిగిన కథంతా చెప్పాను. నేను మాస్టారి దగ్గర తనవల్ల తిట్లు తిన్నానని తెలిసి చాలా ఫీలయ్యి కంటతడికూడా పెట్టుకుంది. నేనీ విషయం తనకి ముందే చెప్పియుంటే ఇలా చేసేదాన్ని కాను అని కాసేపు విలపించింది.  యథావిధిగా రెండువారాలు సాగాయి. ఒక రోజు స్వప్న కొత్త లంగా వోణీలో వచ్చింది. మనిషి కొంత కంగారుగా కనిపించింది. ఏమైంది అని అడిగితే, ఏమిలేదంది. నేను పాఠం మొదలుపెట్టాను. ఉన్నట్టుండి దగ్గరగా వచ్చి నా చేయి లాక్కుని ముద్దుపెట్టేసింది! నాకు వళ్ళంతా చెమట్లు పట్టేశాయి. చేయి విదిలించుకున్నాను. "ఐ లవ్ యూ, సూర్యా" అని అందోళనపడుతూ చెప్పేసింది! నాకు ఈ అమ్మాయి చేసిన పనీ, చెప్తున్న మాటలూ అర్థంకాక స్తంభించిపోయాను. అక్కడితో ఆపకుండా ఇంకా "నువ్వంటే నాకు చాలా ఇష్టం, సూర్యా! నాకోసం నువ్వు ఎంత పని చేశావు. గ్రాఫ్ షీటుకూడా గీసిపెట్టావు. నేనే పిచ్చిదాన్లా..." అని ఏవేవో చెప్తూ ఏడవడం మొదలు పెట్టింది. నాకు నోట్లో మాటలు రాలేదుకానీ, భయముతో కూడిన కోపమైతే వచ్చింది. సినిమాల్లో నాగేశ్వర రావూ, సావిత్రీ డూయట్లో డ్యాన్స్ చేస్తుంటేనే ఏంటో ఈ పిచ్చి గోల అని ముఖం తిప్పుకునే నాకు ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంటే ఎలా ఓర్చుకోగలను? 


కోపంగా తిట్టేసి డాబామీదనుండి కిందకు వెళ్ళిపోయాను. ఎవరైనా పిల్లలు క్లాస్ కి వచ్చేంతవరకు కిందే కాసేపు ఉండి ఆ పైన పైకి వెళ్ళాను. ఆ అమ్మాయి వంక చూస్తే వేరేవాళ్ళతో మాటల్లో పడిపోయింది. అప్పటికిగానీ నాలో వణుకు సగానికి తగ్గలేదు. ఆ రోజు ప్రైవేటు క్లాస్ అవ్వగానే మూర్తీతోకూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పటికే నాకు జ్వరం వచ్చేసింది. అమ్మ చూసి "ఒళ్ళంతా కాలిపోతూ ఉంది" అని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ రాత్రంతా నిద్రలో ఉలికులికిపడి ఏదేదో మాట్లాడానట. అమ్మ భయపడిపోయారు. వెళ్ళి చేంబ్రోలు మంగమ్మ అవ్వ గార్ని తీసుకొచ్చారు. ఆ అవ్వ నా నుదుట చేయిపెట్టిచూసి, "ఇది మామూలు జ్వరం కాదు. ఏదో చూసి భయపడడంవల్లో, ఏ దయ్యమో సోకడంవల్లో వచ్చిన జ్వరం" అని పక్కూరిలో ఉన్న మంత్రీకుణ్ణి పిలిపించి వేపాకుతో మంత్రమేసి, నుదుట వీభూతి రాశారు. నాలుగు రోజులకు జ్వరం తగ్గింది. మళ్ళీ ప్రైవేటుకు వెళ్ళాలా? అని భయమేసింది. మరో ఉపాయం కనిపెట్టాను. 


ఆ రోజు ఉదయం ప్రైవేటుకు వెళ్ళకుండా బయట తిరిగేసి స్కూల్ కి వెళ్ళిపోయాను. సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేశాను. నాన్న "ప్రైవేట్ క్లాసుకు వెళ్ళలేదా?" అని అడిగితే "ఫైనల్ ఎగ్జాంస్ దగ్గరపడుతున్నాయి; ఇక ప్రైవేట్ అవసరంలేదు, ఇంట్లోనే చదువుకోమన్నారు నాన్నా మాస్టారు" అని చెప్పేశాను. అంతటితో సమస్య తీరిందనుకున్నాను. ఒక వారం రోజుల తర్వాత వెంకటేశరెడ్డి మాస్టారు మా క్లాసుకి వచ్చి నన్ను బయటకి రమ్మని పిలిచారు. "ఎందుకు ప్రైవేట్ క్లాస్ కి రావడంలేదు?" అని అడిగారు. "ఫైనల్ ఎగ్జాంస్ దగ్గరపడుతున్నాయి; ఇక ప్రైవేట్కి వెళ్ళొద్దు, ఇంట్లోనే చదువుకోమన్నారు మా నాన్న గారు" అని చెప్పేశాను.


పరీక్షలకి ఇంకా ఒక నెలే ఉంది. ఓ రోజు సాయంత్రం మా నాన్న గారు కోపంగా ఇంటికి వచ్చారు. 


"ఎక్కడ వాడు?" అనియడిగారు. ఇంత వరకు మా నాన్నకి కోపం వచ్చి నేను చూళ్ళేదు. మా అమ్మ వచ్చి ఏమైంది అని అడిగితే, 
"వెంకటేష్ ఇందాక బజార్లో కనబడ్డాడు. మీ అబ్బాయిని ఎందుకు ప్రైవేట్ క్లాసుకి మానిపించేశారు అని అడిగాడు. నేను తిరిగి మీరే వద్దన్నారటగా అని అడిగుంటే ఏమయ్యేది? ఏదో సర్ది చెప్పి వచ్చాను. వీడు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నాడు?" అని కోపంగా నాకేసి చూశారు. నేను మరోసారి వణికిపోయాను. 


"మొదట్నుండి వాడికి ప్రైవేట్ క్లాస్ కి వెళ్ళడం ఇష్టంలేదు. అయినా మనమే బలవంతంగా పంపించాము. ఇంట్లో స్వయంగా చదువుకుంటున్నాడుగా? వదిలేయండి. ఆ వెంకటేశరెడ్డి గారికి ఇంట్లో పనులంతా చేసిపెట్టడంకన్నా మనింట్లో కూర్చుని శ్రద్ధగా చదువుకోనివ్వండి" అని అమ్మ నాకు మద్దతు పలికారు. 


నాన్న శాంతించి, "చదువుకుంటే ఎవరు కాదన్నారు. అదేదో నిజం చెప్పేసి చదువుకోవచ్చుగా? అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నాడు?" అన్నారు.


కథ సుఖాంతంగా ముగిసింది అనుకుంటున్నారా? లేదు. స్కూల్లో ఆ అమ్మాయి చూపులకు తగలకుండా తప్పించుకున్నాను. చివరగా పరీక్షల టైం కి హాల్ టిక్కెట్ పట్టుకుని ఎగ్జాం హాల్ దగ్గరకు వెళ్తే నా వెనకాలుంది ఆ అమ్మాయి. ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో రిజిస్టర్ నెంబర్లిచ్చారు. నా పేరు "Surya Narayana" ఆ అమ్మాయి పేరు "Swapna " కదా?


నన్ను చూడగానే ఒక చిరునవ్వు చిందించి "సారీ, సూర్యా! ఆ రోజు నేను నీతో అలా ప్రవర్తించుండకూడదు. నీకు జ్వరమొచ్చిందట కదా? మూర్తి చెప్పాడు. ఆల్ ది బెస్ట్, పరీక్షలు బాగా రాయి" అంది. అప్పటికిగానీ నేను తేరుకోలేదు. రోజూ పరీక్షలు అవ్వగానే ఎలా రాశామో అని రెండు మాటలు మాట్లాడుకుని, తరువాయి పరీక్షకు ఆల్ ది బెస్ట్లు చెప్పుకుని అలా అయిపోయాయి నా పదవ తరగతి పరీక్షలు. 


ఫలితాలు వచ్చాక సర్టిఫికేట్లు తీసుకోడానికి స్కూల్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ పలకరించుకున్నాము. "నేను మెడ్రాస్ వెళ్ళిపోతున్నాను +1, +2 చదువుకోడానికి" అని చెప్పేసి సెలవు తీసుకున్నాను. ఆ పైన రెండేళ్ళ తర్వాత మూర్తీని కలిసినప్పుడు… (అది ఇంకొక కథగా రాయచ్చులెండి). ఇప్పటికి శుభం.

-----------------XXXX-----------------

18 అక్టోబర్ 2011

దయ్యాన్ని చూడాలన్న నా అపేక్ష...

[మీకు దయ్యలన్నా, దయ్యాల కథలన్నా భయమేసినా పరవాలేదు; చదవండి]

చిన్నప్పుడు zoo, సర్కస్ల లోని కొత్త జంతువుల గురించి చూసినవాళ్ళు చెప్తుంటే వాటిని నేనూ చూడాలని ఎలా ఆశపడేవాణ్ణో అలగే దయ్యాన్ని కూడా చూడాలని ఆశపడేవాణ్ణి. నాకు చీకటంటే ఎంత ఇష్టమో! రాత్రి వేళల్లో టార్చ్ లైట్ సాయంతో మా తాతా, మా నాన్నా పొలం దగ్గరకు వెళ్తుంటే నేనూ వెళ్ళాలని తెగ ఆరాటపడేవాణ్ణి. అయినా తీసుకెళ్ళరు! చీకట్లో గనిమలమీద పురుగుపుట్ర అవి ఉంటాయి వద్దు అనేవారు.


ఈ దయ్యాలు చీకట్లోనే, అదీ కొన్ని చోట్లే కనబడతాయనీ చెప్పేవారు. వాళ్ళూ, వీళ్ళూ దయ్యం చూశాము అంటే ఎంతో ఆసక్తితో వినేవాణ్ణి. నన్నూ తీసుకెళ్ళి చూపమని ప్రాదేయపడేవాణ్ణి. ఒక్కరూ తీసుకెళ్ళేవారు కాదు. మా నాన్ననో, తాతనో అడిగితే "దయ్యాలూ లేవు, భూతాలూ లేవు! జనాలలా పొద్దుపోక ఏవో అంటారు" అని నిష్కర్షగా చెప్పేసేవారు. ఎవరేమనినా, దయ్యాన్ని చూసేందుకు నేను చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆపుకోలేదు. రోజూ రాత్రి భోజనం అయ్యాక, ఎక్కడైతే దయ్యాలను, కొరివి దయ్యాలను చూసినట్టు చెప్పారో ఆ దిక్కుకేసి చూస్తూ నిలుచుండేవాణ్ణి. ఒక దయ్యమైనా కనబడడేది కాదు :(

ఇలా ఉండగా ఓ సారి, వేరుశనక ఒబ్బిడి చేసిన కాలంలో మా తాత గారు పొలంలోని కళ్ళము[harvest ground] దగ్గర కాపలాకి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఆ పొలం మా ఇంటినుండి కొంచం దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారిలోనే శ్మశానముండేది. ఆ శ్మశానం దగ్గర దయ్యాలను చూసినట్టు చాలా మంది కథలు చెప్పేవారు. ఇదే మంచి అవకాశం అనుకుని తాత గారితో, "నేనూ వస్తాను" అని మొండికేసుకున్నాను. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బాగా గుర్తుంది ఏడ్చాను కూడా. నాకు అప్పుడు ఆఱో, ఏడో సంవత్సరాల వయసు. ఇక లాభంలేదని అమ్మ, నాన్న ఇద్దరూ తీసుకెళ్ళమని తాతతో చెప్పారు. మా పొలంలో పనిచేసే గుండేలు(గుండు+వేలు) కూడా అప్పుడే వచ్చారు. కప్పుకోడానికి నాకో దుప్పటి అందుకుని ముగ్గరం నడవడం మొదలుపెట్టాము. టార్చ్ లైట్ పెద్దగా అవసరం రాలేదు. కొంత వెన్నెల వెలుగుంది.


శ్మశానం దగ్గరౌతుంటే నాలో పట్టలేని ఆనందం. ఏటి గట్టు దాటగానే శ్మశానం వైపుకేసి చూస్తూ నడుస్తున్నాను. నేను వస్తున్నట్టు దయ్యాలకు తెలిసిపోయిందేమో, ఒకటైనా కనబడదు. శ్మశానం దగ్గరకు కూడా వచ్చేశాము. దయ్యమే కనబడదు. ముందు తాత, వెనక గుండేలు, ఆ వెనక నేను. శ్మశానానికి నేరుగా వచ్చినా దయ్యం కనబడదు. నేను అక్కడే ఆగిపోయాను! కొంత ముందుకెళ్ళిన గుండేలు తిరిగిచూసి


"అక్కడే నిల్చుకున్నావే? రా, నైనా?" అన్నాడు.


"నడిపి రెడ్డి మామ మొన్న ఇక్కడే దయ్యాన్ని చూశారట. నేనుకూడా చూసేసి వస్తాను. మీరు పొండి" అన్నాను.


"ఇప్పుడు అవేవీ కనబడవు. మనం పదాం రా" అని వచ్చి లాక్కుని వేళ్ళాడు గుండేలు.


కాసేపటికి మా పొలంలోని కళ్ళము చేరుకున్నాము. రాశిబోసిన పచ్చి వేరుశనగ కుప్పమీద గోతము పట్టలు కప్పి, చుట్టూ రాళ్ళు పెట్టున్నారు. పక్కనే తాతకోసం ఒక నులక మంచం. ఇవతల వైపు గుండేలు పడుకోడానికి పచ్చి వేరుశనగ తీగలను పరుపులా పరచియున్నారు. ఈ ఏర్పాట్లు మా నాన్న సాయంత్రం ఇంటికొచ్చేముందు చేసిపెట్టినవి. నేను వస్తానని మా నాన్నకు తెలియదు గనుక మరో మంచం ఏర్పాటు చెయ్యలేదు. ఆ నులక మంచం మీద నేనూ తాతా కూర్చున్నాము. ఇక్కడ్నుండి శ్మశానం బాగా కనబడుతుంది. నేను మాత్రం శ్మశానం ఉన్న వైపుకి తిరిగి కూర్చుని, నాకోసం ఓ దయ్యమయినా కరుణించి దర్శనమివ్వదా అనే రీతిలో చూస్తున్నాను. వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలికి కొమ్మలు ఊగడమూ, వెన్నెలా, చుక్కలూ తప్ప నా కంటికి ఒక దయ్యమూ కనబడలేదు :(


కాసేపటికి పడుకోమని చెప్పి మంచంమీదనుండి లేచి పక్కనున్న వేరుశనగతీగల పరుపుమీద తన శాలువా పరచి పడుకున్నారు తాత. గుండేలు కొన్ని వేరుశనగ తీగలు తీసుకొచ్చి మంచం పక్కనే పరుపులా పరిచి తన దుప్పటి పరచాడు. నేనింకా పడుకోకుండా శ్మశానానికేసి చూస్తుండడం గమనించి,


"పడుకో, నైనా! ఈపొద్దింక దయ్యాలు కనబడవు" అన్నాడు.


"ఇంకా టైమ్ అవ్వలేదేమో. నువ్వుపడుకో, నేను ఇంకోంచేపు చూసి పడుకుంటాను" అన్నాను.


"నువ్వెంతసేపు చూసినా ఈపొద్దవి బయటికి రావ్వు, పడుకో"


"ఈ పొద్దు ఎందుకు రావ్వు?"


"పెద్దాయన ఉన్నాడు కదా, ఆయనంటే వాటికి భయం కదా, అందుకే రావ్వు"


గుండేలు చెప్పిన కారణం ఆ వయసులో నాకు కొంత నమ్మశక్యంగా అనిపించింది. ఎందుకంటే తాతగారికి ఆధ్యాత్మికవ్యక్తిగా పేరుండేది! ఊర్లోవాళ్ళు తమ సమస్యలను చెప్పేవారు. కొందరు జ్యోతిషము చెప్పించుకునేవారు. శాస్త్రాలూ అవి చెప్పించుకునివెళ్ళేవారు. చిన్నతనంలోనే వేదపఠశాలలో చేరి వేదపఠనం, పౌరోహిత్యం నేర్చుకున్నారు. సంస్కృతము, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ నాలుగు భాషల్లోనూ పాండిత్యం పొందినవారాయన! [బ్రిటీష్ ఇండియా పాస్పోర్ట్ కూడా ఉండేది. అప్పట్లో నాకు దాని విలువ తెలియలేదు; లేకుంటే భద్రపరచి ఉండేవాణ్ణి :( ]


గుండేలు మాటలతో కాసేపటికి నిద్రలోకి జారుకున్నట్టున్నాను. ఏ నడి జాము వేళో, నిద్రలో తాత "గుండేలూ, గుండేలూ" అని పిలుస్తున్నట్టు వినిపించింది. క్షణాలలో వారిద్దరూ బావి దగ్గరకు పరిగెడుతున్నారు. వాళ్ళు పరిగెడుతున్నది గమనించి వారి వెనుకే నేనూ దుప్పటలా విసిరేసి పరుగుతీశాను. నేను నిద్రలేచాననీ, వారి వెనకే వస్తున్నానీ తెలియదు వారికి. బావి దగ్గరున్న మోటర్-పంప్ షెడ్ అవతల వైపు  గుండేలూ, తాతా కాకుండా మరో వ్యక్తి పరిగెడుతున్నాడు. గుండేలు క్షణాల్లో వెళ్ళి వాణ్ణి పట్టేసుకున్నాడు. మోటర్ దొంగతనంకోసం వచ్చిన ఓ దొంగ వెధవ! అప్పటికే నట్లూ, బోల్ట్ లూ ఊడపీకేశాడు. ఏదో గట్టి శబ్ధం తాతకి వినబడగానే వచ్చి పట్టేశారు. టవల్ తో వాడి రెండు చేతులూ కట్టేసి షెడ్ పక్కనున్న ఓ మానికి కట్టారు ఆ దొంగని. తెల్లారాక పోలీసు స్టేషన్ కి కబురుచేసి వాణ్ణి అప్పగించారు. ఆ దొంగ ఇదివరకే చాలా బావుల దగ్గర మోటర్లనూ, పైపులనూ దొంగిలించాడని ఆపైన తెలిసింది.


కొన్నాళ్ళ తర్వాత మరో సందర్భంలో తాతతో మాట్లాడుతుంటే, [ఆ నాటి మాటలు యథావిధిగా నాకు గుర్తులేదు - ఇప్పటిమాటల్తో ఆ భావాన్ని ఇక్కడ రాస్తున్నాను]


"తాతా, నువ్వుండే చోట దయ్యాల అవి రావట, కదా?" అనడిగాను.


"నేనున్న చోటికే కాదు, ఎవరున్న చోటికీ రావ్వు. అసలు దయ్యాలు ఉంటే కదా వచ్చేది?"


"దయ్యాలు లేవ్వా? మరి నడిపిరెడ్డి మామా, కేశవుల్నాయుడు మామా, శంకరన్నా వీళ్ళంతా ఆయుస్సు తీరకుండానే ఉరేసుకుని సచ్చిపోయిన 'గద్దే'వాళ్ళ అవ్వ దయ్యంగా తిరుగుతూ ఉంది, మాకు కనబడింది అని చెప్పారూ?"


"ఆయుస్సు తీరకుండ ఎవరూ చావరు. ఉరేసుకున్నా, మందుతాగినా, వేరేవాళ్ళచేత చంపబడినా ఆయుస్సు తీరాకే చావడం అన్నది జరుగుతుంది. ఏ ఒక్క మనిషి ఆత్మా దయ్యంగా తిరగదు. దయ్యం, భూతం అన్నది చీకటి ముసుగులో దొంగపనులు చెయ్యాలనేవారు సృష్టించిన కల్పన."


"కల్పన అయితే వీళ్ళ కంటికి ఎలా కనబడింది?"


"వీళ్ళ మదిలో ఉన్న భయమే అక్కడ దయ్యంగా దృశ్యావతారం ఎత్తుతుంది. మన మనసులోని దయ్యమే అది. అంతా భ్రమ. ఆ దోంగల సృష్టికి వీళ్ళ భయాలు ప్రాణం పోస్తాయి."

============ XXXXXXXXX===========

14 అక్టోబర్ 2011

కాలం నేర్పిన బ్రతుకు ప్రయాణం...


భాస్కరుడు :
కాలమా, కాసేపు ఆగు కబుర్లు చెప్పుకుందాం.


కాలం :
భాస్కరా, మనమిద్దరం ఆగితే విశ్వమంతా ఆగిపోతుంది! నడుస్తూ మాట్లాడుకుందాం.


భాస్కరుడు :
సరే. చిరున్నవ్వు చెదరకుండా, ఎక్కడా ఆగకుండా బ్రతుకు నడక సాగిస్తున్నావే అలసటా, విసుగూ అనిపించదా నీకు? ఆ రహస్యం మాకూ చెప్పరాదూ?


కాలం :
బ్రతుకు ప్రయాణం వెన్నెల కాచే నందవనంలోనే సాగదు, బాటలో చిమ్మచీకట్లుకమ్మిన కారడవులొస్తాయి. పరాగ్గావిహరిస్తూ నందనవనంలో ఉన్న సౌందర్యాలను ఎలా ఆస్వాదిస్తానో అలాగే, ఏకాగ్రతగా నడుస్తూ కారడవుల్లో ఉన్న సవాళ్ళనూ ఆస్వాదిస్తాను.


భాస్కరుడు :
ఇదెలా సాధ్యమయ్యింది?


కాలం :
ఆ సౌందర్యాలమీదా, ఈ సవాళ్ళమీదా భావావేశమైన అనుబంధం(Emotional Attachment) పెంచుకోలేదు కాబట్టి.


భాస్కరుడు :
అయితే నువ్వే సుఖ జీవివి!


కాలం :
అది సుఖమా? అలా ఉండేందుకు దేవుడలా వదిలేస్తాడా?


భాస్కరుడు :
నిన్ను వదిలేశాడుగా?


కాలం :
లేదు, నందనవనం మీద అనుబంధం పెంచుకున్న సహబాటసారిమీద అనుబంధం పెంచెళ్ళిపోయాడు.


భాస్కరుడు :
సహబాటసారిని నీలా మార్చేసుకో.


కాలం :
మార్చిన రోజు, "మీతో తీసుకెళ్ళండి" అని మరో బాటసారిమీద మాకిద్దరికీ అనుబంధం అంటగట్టి వెళ్ళాడు.


భాస్కరుడు :
పెద్ద కష్టమొచ్చిందే బ్రతుకు ప్రయాణంతో! అయితే సహబాటసారి మీద అనుబంధం పెంచుకోకుండా ఉండే ఉపాయమేదో నేర్చుకో.


కాలం :
ఆ ఉపాయం చెప్పమని దేవుణ్ణే అడిగాను.


భాస్కరుడు :
ఏమన్నారు?


కాలం :
సహబాటసారిమీద అనుబంధం పెంచుకోలేని ప్రయాణం విరక్తినే మిగుల్చుతుంది అందువళ్ళ ఇలాగే కొనసాగించమని సెలెవిచ్చాడు.

----XXX----

29 సెప్టెంబర్ 2011

ఈ యుద్ధం ఓటమికోసమే...

ఇంతకాలం నా దారిలో యే అడ్డంకులూలేవు
ఏ దేవత పంపిందో నిన్ను,
నా దారిపొడవునా తీపి అడ్డంకివై వ్యాపించావు!

"నా దారి తప్పుకో" -
మదిలోని ఈ మొగ్గ భావాన్ని
పెదవుల్లో పూయించాలనుకున్నా!
నీ మోహనరూపు మహత్యమేమో
నా పెదవులు చేరగానే
నీ పూజకోసమే అన్నట్టు
చిరునవ్వుగా వికసించింది!

నిముషానికి వందసార్లనుకుంటాను
దురమైపోవాలని - అదేంటో
క్షణానికి లక్ష సార్లు దగ్గరైపోతున్నాను!

వద్దనుకుంటూనే కావాలనుకునే ఈ వింత
నువ్వు నేర్పిన ఓ కొత్త విద్య!

మామూలు పదములు తీయనవుతాయనీ,
బరువైన భావాలను తెస్తాయనీ - అవి
నా చిత్తాన్ని చిందరవందర చేస్తాయనీ
నీ పెదవుల దాటేవరకు తెలియదు నాకు!

ఎలా నవ్వితే నా నిష్ట కరిగిపోవునో
ఎలా చూస్తే నా వైరాగ్యం హద్దుదాటునో
నీకు బాగా తెలిసిపోయింది!
నా అణువణువును కలవరపెట్టే
ఆ లేత నవ్వులనుండీ, కోంటె చూపులనుండీ
కాపాడుకునే ఉపాయమొకటి ఇప్పటికిప్పుడే కనుక్కోవాలి!

నన్ను ముక్కలుముక్కలుగా కాకుండా
మొత్తాన్ని ఒకేక్షణంలో వశపరుచుకోవలసింది!
ఇప్పుడుచూడు, నీవశంకాకుండా శేషమున్న ముక్కలు
నీమాయలోనుండి తప్పించుకోడానికీ,
నీవశమైన ముక్కల్ని విడిపించుకోడానికీ
నీకెదురుగా గూడుపుఠాణీలు చేస్తున్నాయి!


"వశమయినదే ఎక్కువ -
శేషమున్నది తక్కువేలే" అని సంబరపడకు!
గుర్తుందిగా కురుక్షేత్రం?

అబ్బా, అంతలోనే మొహమలా పెట్టేసి
కలవరపడిపోకు - ఇవి పైపై మాటలే!

రహస్యం చెప్తాను - శేషమున్న ముక్కలు
యోధుల్లా యుద్ధరంగంలో గర్జించినా
అంతరంగంలో అర్థించేది నీపొందుకోసమే
ఈ ఓటమంతా ఆ గెలుపుకోసమే!

25 సెప్టెంబర్ 2011

ఆంధ్ర రాష్ట్ర విభజన : అవినేని భాస్కర్ - "అరవ" భాస్కరన్ అయిన కథ...

మనదేశ స్వాతంత్రానికి ముందువరకు చిత్తూర్ జిల్లాకీ, నెల్లూర్ జిల్లాకీ దక్షిణంగా ఆనుకునియున్న తమిళనాడు జిల్లాల్లో తెలుగువారి సంఖ్యే ఎక్కువగా ఉండేదిట. మదరాసు ప్రెసిడెంసిగా ఉన్నప్పుడుకూడా అదే పరిస్థితిట. కొన్ని అనివార్య కారణాలవలన, ఉన్నతమైన ఉద్ధేశంతో, ఉత్తమ నాయకులు కొందరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నారు. జిల్లాలో ఎక్కువగా తెలుగువారుంటే ఆ జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనూ, తమిళులుంటే తమిళనాడులోనూ కలిపేశారు. అప్పట్లో మదరాసు పట్టణము, ధర్మపురి, ఆర్కాడు, చెంగల్పట్టు జిల్లాల్లో ఎక్కువగా తెలుగువారే ఉన్నప్పటికీ కొందరు తమిళ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం కొన్ని ఎత్తుగడలేసి ఈ జిల్లాలను తమిళనాడులో కలిపేశారట. 


ధర్మపురి & కృష్ణగిరి జిల్లాలు :

ఇది అప్పటి కాంగ్రస్ నాయకులు రాజాజీ అనబడే రాజగోపాలాచారి గారి సొంత జిల్లా! ఆయన అప్పటికే తమిళుల మధ్య పలుకుబడిగల నాయకుడు. తన సోంత ఊరూ, జిల్లా ఆంధ్రాలో కలిసిపోతే ఇటు తమిళనాడు రాజకీయాల్లోనూలేక, అటు ఆంధ్ర రాజకీయాల్లోకీ వెళ్ళలేక అయోమయం అవుతాడుగనుక తమ జిల్లాను తమిళులు ఎక్కువవున్న జిల్లాగా ప్రకటించి తమిళనాదులోకి కలిపేశారు. ఇప్పటికీ ఇక్కద గ్రామాలపేర్లు తీసుకుంటే తమిళ, కన్నడ పేర్లకన్నా తెలుగు పేర్లే ఎక్కువ. 


చెంగల్పట్టు (ఇప్పుడు తిరువళ్ళూర్ & కాంజిపురం) జిల్లా :

అప్పటి మదరాసు ప్రెసిడెంసీ రాజధాని మదరాసే. ఈ మదరాసు(చెన్నై) చెంగల్పట్టు జిల్లా మధ్యభాగాంలో ఉంది. చెంగల్పట్టు జిల్లాని తెలుగు జిల్లాగా గుర్తిస్తే ఇక మదరాసుపట్టణం కూడా ఆంధ్రాకే ఇవ్వాలికదా? మదరాసుని కోలిపోడానికి ఇష్టంలేని నాయకులు చెంగల్పట్టు జిల్లాని తమిళజిల్లాగా కల్పించారు. 


ఆర్కాడు జిల్లా (ఇప్పుడు వేలూర్ జిల్లా) :

పడమటిదిశలోని ధర్మపురినీ, తూర్పుగాయున్న చెంగల్పట్నీతమిళనాడులోకి కలిపేశాక మధ్యలో ఉన్న ఆర్కాడుని ఆంధ్రాలోకి కలిపితే ధర్మపురి జిల్లాకి దారెలా? అందుకని ఈ జిల్లా పొలిమేరలుకూడా తమిళంతోనే గీసేశారు. ఈనాటికీ  జ్యోతిష్యులు చాలావరకు వాడేది ఆర్కాడు తెలుగు పంచాంగాలే. 

మిగిలిన తమిళనాడు జిల్లాల్లోకూడా తెలుగువారున్నారు. సంఖ్య తక్కువ అంతే. 




అధికారభాష

మొదట్లో ఈ ప్రాంతాలలో ఎక్కువగా తెలుగు బళ్ళుండేవి. బళ్ళుంటే చాలా? బల్లలమీదకూడా తెలుగే ఉండాలికదా? ఈ ప్రాంతాల్లో  అధికార భాష తమిళం గనుక ప్రతిచోటా తమిళంలోనే రాయబడ్డాయి. ఇది కొంతవరకు యుక్తిపూర్వకంగానే చేశారు. ఉద్యోగాలకోసమనో, మరికొన్నిసౌకర్యాలకోసమనో తమపిల్లల్ని తమిళం చదివించక తప్పలేదు ఈ ప్రాంతంలోని తల్లి తండ్రులకి. అక్కడితో ఆగలేదు - ఉద్యోగాలివ్వడంలోకూడా తెలుగుపేర్లున్నవారిని వెనక్కిపెట్టేవారట. తమ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకర్తలు అందరూ తమిళులే ఉంటే ఇక ఇక్కడ తెలుగువారికి తమిళం నేర్చుకోడం తప్పనిసరైయింది. తెలుగుబళ్ళకు పిల్లలులేక క్రమేనా మూతబడుతున్నాయి తెలుగు స్కూల్లు. అందులోని ఉపాద్యాయులుకూడా ఉద్యోగం అవసరంగనుక 10వ తరగతి తమిళ పేపర్ పరిక్షరాసి తమిళ స్కూల్లలో పనిచెయ్యడానికి వెళ్ళిపోయారు. మా బంధువుల్లో ఎందరో ఉపాద్యాయులు ఇలా చేశారు పాపం.

ఇక్కడ బడిపంతులు మొదలుకొని, విలేజ్ ఆఫీసర్ వరకు తమిళులే. వీరికి అనధికారంగా ఏమైనా ఉత్తరవులిచ్చారో ఏమో మరి. వీలైనంతవరకు ఇక్కడవాళ్ళను తమిళవారుగా చేసిపడేశారు. ఎలా?


ఊర్ల పేర్లు :

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఊరిపేర్లలో జాతిపేర్లుండేటివి. జాతిపేర్లను తొలగిస్తాం అంటూ వాటిని తమిళ ఊర్లుగా మార్చేశారు...
నరసింహరాజు పేట --> నరసిమ్మన్ పేట్టై
మునసామి నాయుడు కండిగ --> మునసామి కండిగై
బుచ్చిరెడ్డి పల్లె --> పుచ్చిపల్లి
గొర్రెదాటుబెట్ట --> కేత్తాండన్ పట్టి
గొల్లకుప్పం --> కొళ్ళిక్కుప్పం
కావేరిరాజులుపేట --> కావేరికారిపేట్టై
సూరరాజపట్టెడ --> సూరాజిపట్టడై
ఇలా చాలా తెలుగుళ్ళుకు తమిళులు నామాలేశారు!


వ్యక్తుల పేర్లు :

జనాబ సంఖ్యలెక్కరాసే అధికారీ, రేషన్ కార్డిచ్చేవాడూ, ఎలక్టోరల్ అధికారీ వీరందరూ కూడా ఇలా రాసేసేవారు...
సుందరమ్మ --> సుందరామ్బాళ్
దేవకమ్మ --> దేవగి అమ్మాళ్
చిన్నబ్బ --> చిన్నప్పన్
కుప్పయ్య --> కుప్పన్ / కుప్పయ్యన్
శ్రీనివాస్ --> శ్రీనివాసన్
కేశవులు --> కేసవన్
రామకృష్ణ --> రామకిరుష్ణన్
జ్యోతి --> జోది
రాఘవులు --> రాగవన్
రాహుల్ --> రాగుల్

రేషన్ కార్డులోనో, వోటర్ కార్డులోనో అచ్చయి వచ్చాక చూసుకుని బాధపడేవారు ఉన్నారు, అసలు వాటిగురించి అసలు ఆలొచించని వారూ ఉన్నారు. మార్చుకోవాలని ఆశవున్నా ఆ గవర్నమెంటు ఆఫీసులు చుట్టు తిరిగాలన్న భయంతో ఇప్పుడు పేరిలా ఉంటే వచ్చే నష్టం ఏముందిలే అని సర్దుకునేవారూ ఉన్నారు.

ఇలా తమిళనాట ఎందరో తెలుగువారు తమ ఐడెంటిటీని కోలిపోయారు. 

ఇది కేవలం ఐడెంటిటి కోలిపోవడంమాత్రమే కాదు, తెలుగుతనానికి దూరమవ్వడం, తెలుగు సాంప్రదాయాలు తెలియకపోవడం, భాష మరిచిపోవడం వంటి పెద్ద నష్టాలూకూడా జరిగిపోయాయి. ఎందరో తెలుగువారి ఇళ్ళల్లో పాతికేళ్ళలోపున్నవారు తెలుగు మాట్లాడ్టంలేదు. తెలుగు నాలుకలమీద తమిళ సరస్వతి సింహాసనమేసుకుంది. వారి మాతృభాష తమిళమే అన్న పరిస్థితి తయారైంది.

=================================================

తెలుగుభాషాభిమానంగల కుటుంబంలోపుట్టిన నాపేరుకూడా ఇలానే చెలామని అవుతుందంటే ఆ తమిళీకరించే తీవ్రత ఎంతగా ఉంటుందో ఆలోచించండి. 

1989 వరకు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరి కాదు మనదేశంలో. పదో తరగతి మార్కు షీట్లో ఏముందో అదే పేరు. నేను అంతకుముందే పుట్టానుగనుక నా పదవతరగతి నార్కుషీటులో ఓ తమిళుడు నా పేరుకు అరవరంగేసేశాడు.  ఇంట్లో నాకు భాస్కర్ అని పేరుపెట్టారు. బళ్ళో రాయగా "A BHASKAR" అని రాశారు. పదవ తరగతి పరీక్షలకు మునుపు ఫార్మఫిల్ చెయ్యాలి...

Name : BHASKAR
Initials : A

నేనిలా రాసిస్తే, చివరికి మార్కుషీట్లో "BHASKARAN N" అని వచ్చింది. తమిళులకి ఇంటిపేరుండదు, పేరుకు చివర తమ తండ్రిపేరు మొదటి అక్షరాన్ని అంటించుకుంటారు. నాకూ అలానే మా నాన్న పేర్లోని 'N' తీసి అంటించేశారు. నా రిజిస్టర్ నెంబర్, మార్కులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.  ఏజుకేషన్ డిపార్త్మెంట్ లోని వెర్రి క్లెర్కు చూపిన తమిళ అభిమానాన్ని చూసి నేను గోలుగోలుమని ఏడ్చాను! పేరు మార్చడానికి అప్లై చేస్తే రాడానికి 3 నెలలవుతుందన్నారు. పైన చదవాలంటే మార్కుషీటు కావాలి కదా? అంతవరకు ఎలా ఆగడం? తెలిసిన ఒక మాస్టారుని సలహా అడిగితే,

"ఉండిపోనీలేవయ్యా, ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యొగాలకు అప్లై చేసినప్పుడు పక్కనపెట్టరు" అని సెలవిచ్చారు.

 ఇలా ఎందరో తెలుగువారు తమిళులుగా చెలామనియవుతున్నారు!

04 సెప్టెంబర్ 2011

చెల్లాయికి...


ఈ కార్తీకమొస్తే ఇరవైరెండు వసంతాలొస్తాయి నీకు.
దారిన వెళ్ళే కొత్త జంటలూ,
పట్టుచీరల, నగల కొట్లవారి భారీప్రకటనలూ
గుర్తుచేస్తున్నాయి - నీకు వరుడ్నిచూడాలన్న నా బాధ్యతను!

చక్కగా చదువుకున్నావు
ఉద్యోగం చేస్తున్నావు
చేతినిండా సంపాదిస్తున్నావు
నీకు సరితూగే వరుడ్ని కనుక్కోవాలి!
ఎక్కడ వెతకాలి మంచివారిని?
ఆ మంచివారిలో సరైన వరుడెవరనని ఎలా తెలియాలి?
కనుపాపలా నిను కాచుకునే పురుషోత్తముణ్ణెలా గుర్తించాలి?

ఎవరినైనా వలపించావా అనడిగాను
నువ్వు వలపించేంత గొప్ప పురుషపుంగవులెవ్వరినీ
ఇదివరకు కలుసుకోలేదన్నావు.

నా స్నేహితుళ్ళో ఎవరికీ
నిను వరించే యోగ్యత లేనట్టే అనిపిస్తుంది!
నీ స్నేహితులను పరిశీలిద్దామనుకున్నాను
ఎవరూ నెగ్గరు!

కోట్లూ, కనకాభరణాలూ అడిగేవాళ్ళను
మగవారిగా పరిగణించలేకున్నాను

నేనుకోరుకునే గుణసంపదలుకలిగిన ఒకరిద్దురు పురుషశ్రేష్టులు
దైనికభత్యంతో పూటగడిపే దశలో ఉన్నారు
అంటే నిను రాణిలా చూసుకోడం వారికి వీలుకాదు!
నువ్వు పేదలింట కష్టాలు పడటం
ఓర్వలేను నేను!

మన ఇంటేమీ కనకపుకంచంలో తినేంత సిరుల్లేవు
నూలుబట్టలూ, రాగియంబిలితోనే పెరిగావు
మెట్టినింటైనా నువ్వు సుఖపడాలనే కోరుతుంది నా మనసు!

అందుకే వెతకాలి
అనురాగంలోనూ, గుణములోనూ, సిరిసంపదలోనూ
మేలిమైన వరుడికోసం!

రాముడే మళ్ళీ జన్మెత్తివచ్చినా తిరస్కరిస్తాను!
చిన్నితల్లీ వద్దు - 
సీతలా నిత్యం శొకిస్తుంటే చూళ్ళేను నిన్ను!

"బ్రతుకు నిత్యపోరాటం
వెనుతిరగక పోరుసాగించు -
అప్పుడే జీవితం ఆనందాల వేడుకవుతుంది"
నా మాటలను నాకే గుర్తుచేస్తున్నావా?
అది నీక్కాదు - నాకూ, నన్ను అనుసరించేవారికీ మాత్రమే!


===========================================================
 2001 ఆగస్టు 19 న తిణ్ణై తమిళ పత్రికలో ప్రచురించబడిన నా తమిళ కవితయొక్క తెలుగు అనువాదం ఇది. 
===========================================================

తమిళ కవిత లింకు...

18 ఆగస్టు 2011

కంటిచూపుతో వధించలేదు...

మెడ్రాస్ లో ప్రతి యేడాదీ, మార్గళి నెలలో "డిశంబర్ సీసన్" అని సాంప్రదాయ సంగీత కచేరీలు జఱుగుతూ ఉంటుంది. ప్రపంచ నలుమూలల్నుండీ విద్వాంసులు వచ్చి మైలాపూర్లోని వివిధ సభల్లో సంగీత విందులందిస్తారు. కుదిరినప్పుడూ, ప్రవేశ చీటీలూ(Entry passes)  దొరికినప్పుడూ వెళ్ళి సాంప్రదాయ సంగీతం ఆస్వాదించి వచ్చేవాణ్ణి. ఒక కచేరీకి నాకు కొన్ని ప్రవేశ చీటీలు దొరికితే ఒకటి నాకుంచుకుని, మిగిలినవి మిత్రులకిచ్చాను. ఓ స్నేహితుడు చివరి క్షణంలో వెళ్ళలేకపోవడంవల్ల ప్రవేశ చీటి తిరిగిచ్చేశాడు. అప్పుడు మా చెల్లి వస్తానంటే తీసుకెళ్ళాను. 

ఆ కచేరీలో గాయని సుబ్రమణ్య భారతి, పాపనాశంశివన్, వేంకటసుబ్బయ్యలు రచించిన అరవ కీర్తనలను భలేగా ఆలపించారు.  తెలుగు కీర్తనలు పాడకుంటే ఆ కచేరిని సాంప్రదాయ కచేరీగానే అరవోళ్ళు భావించరు. తెలుగు కీర్తనలు పాడని వారిని విద్వాంసులుగానే అంగీకరించరు. అందువలన తన ప్రతిభను చాటుకునేందుకు 3 తెలుగు కీర్తనలను మధ్యమధ్యలో ఆలపించారు ఆ గాయని.

ఇంటికొచ్చాక, “కచేరి ఎలా ఉనింది? ఏం కీర్తనలు పాడారమ్మా?” అని మా చెల్లిని అడిగారు. చెల్లికి సినిమా పాటలు పరిచయమేగాని సంప్రదాయ కృతులతో, కీర్తనలతో పెద్దగా పరిచయంలేదు. మా ఇంట పుట్టిన దోషంకొద్ది కొన్ని పాపులర్ కృతులవి పరిచయం! అంతే. అరవ, తెలుగు పాటల జాబితా చెప్తూ వచ్చింది. ఒక కీర్తనను చెప్తూ…
“మా జానకి జడబట్టగ మహరాజువైతివి…”  అని అమాయకంగా అన్నది.

వినగానే ఇంట్లో అందఱం గట్టిగా నవ్వేశాము. “నీ మొహం, అది జడపట్టగ కాదు, "చెట్టబట్టగ" అంటే, చెయ్యిపట్టుకోగా అని   అమ్మ వివరణ ఇచ్చారు. తప్పు మా చెల్లిది కాదు, పాడిన అరవ గాయని ఆ కీర్తనని ఎంతో భావోద్వేగంతో “మా జానకి జడ్డ పట్టక…” అనే పాడారు.
-X-X-X-


ఇది త్యాగరాజస్వాములవారి కృతి. అలమేలుమంగమ్మ ఎలాగైతే తాళ్ళపాకవారింటి ఆడపడుచో అలా, జానకి తిరువారూర్ త్యాగరాజులవారింటి ఆడపడుచు. 

మన ఇంటి ఆడపడుచుని ఒకడికిచ్చి పెళ్ళిచేస్తాం. ఆ అల్లుడు పెళ్ళి తరువాత  సాధించిన సాధనలన్నిటికీ, "మన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నందువల్ల వచ్చిన అదృష్టం అదంతా" అని మన అమ్మాయి గొప్ప జాతకాన్ని పొగుడుకుని ఆనందిస్తాం. కొంతవఱకు అందులో నిజముండచ్చు. భార్యసహకారంలేకుండా పెళ్ళైన యే మగాడైనా సాధించడం సాధ్యముకాదుకదా! 

అలాగే త్యాగరాజుకూడా "రామా మా జానకిని పెళ్ళిచేసుకున్నావు కాబట్టే నీకు ఇన్ని కీర్తులు లభించాయ్, మహరాజువైనావు" అనే రీతిలో పాడుకుని మురిసిపోతున్నాడు. లేకుంటే రామచంద్రుడికి అంత కీర్తి వచ్చేది కాదట. కింద సాహిత్యం చదవండి అర్థం అయిపోతుంది.

========================
రాగం : కాంభోజి
రచన : త్యాగరాజు
========================
పల్లవి
మా జానకి చెట్టబట్టగ మహరాజు వైతివి
రాజరాజ వరరాజీవాక్ష విను
రావణారి యన రాజిల్లు కీర్తియు

చరణం
కానకేగి యాజ్ఞమీరక మాయాకార మునిచి శిఖిచెంతనేయుండి
దానవుని వెంటనేచని యశోక తరుమూల నుండి
వాని మాటలకు కోపగించి కంట వధియించకనే యుండి
శ్రీనాయక యశము నీకే కల్గుజేయ లేదా త్యాగరాజ పరిపాల

'రావాణాంతకుడ'నే కీర్తిని నీకు కట్టబెట్టాలని మా సీతమ్మ రావణుణ్ణి తనకంటితో వధించకుండ ఓరుపుతో నీవువచ్చేవరకు ఆగింది. లేకుంటే, అశోకవనంలో చేండాల రావణుడు ఆడిన మాటలువిన్న ఆ ఉత్తరక్షణాన తన కంటిలో కలిగిన అగ్ని చూపులతో అంతం చేసుండేది వాణ్ణి. 

ఎంతబాగుందో కదండీ సాహిత్యం?

============================================================
సుశీల, శ్రీనివాస్ ల గళంలో ఈ పాట


విజయ్ శివ గారు కచేరిలో పాడిన పాట వీడియోలో వినండి

ఈయనకూడా కొన్నిపదాలను సరిగ్గా పలకలేదు!
ఈ కీర్తనలోని అన్ని పదాలనూ సరిగ్గా పలికిన యే గాయకుని పాటా నేనిదివరకు వినలేదు :(( 


 ==========================================================


    rAgaM : kAMbhOji

    rachana : tyAgarAja

    ========================

    pallavi

    mA jAnaki cheTTabaTTaga maharAju vaitivi

    rAjarAja vararAjeevAksha vinu

    rAvaNAri yana rAjillu keertiyu


    charaNaM

    kAnakEgi yAj~nameeraka mAyAkAra munichi SikhicheMtanEyuMDi

    dAnavuni veMTanEchani yaSOka tarumUla nuMDi

    vAni mATalaku kOpagiMchi kaMTa vadhiyiMchakanE yuMDi

    SreenAyaka yaSamu neekE kalgujEya lEdA tyAgarAja paripAla
===============================================================

13 ఆగస్టు 2011

అందరికన్నా ఆశలు ఉన్నా, హద్దు కాదనగలనా?

కాలమేదైనా ప్రేమ ఒకటే, ప్రేమికుల ఆలోచనా తీరొకటే... 

నీకు నేనంటే ఎంత ఇష్టమో అంతకన్నా నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టం. నాకు అంత ఇష్టం ఉన్నా నువ్వు చెప్పినంత సులువుగా,  స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టు "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పలేను!  నేను అమ్మాయిని.  నీ ప్రపంచంలా ఉండదు నా ప్రపంచం. ప్రతిక్షణమూ ఏవో భయాలతో మెదులుతూ ఉంటుంది నా మనసు.  నాకున్న హద్దులు దాటడం సులువేం కాదు. "I Love You" అన్న తీయని మాటలు నీకు వినిపించినపుడు నీలో వెలిగే ఆ ఆనందాన్ని కనులారా చూద్దామనే ఉంటుంది. అయినా చెప్పలేకున్నా! ఇంతలోనే నువ్వు నన్నపార్థం చేసుకుని నిందించకు... నన్నూ నా స్థితినీ అర్థం చేసుకో... అంటుంది ప్రియురాలు. ఆ ప్రేమికుల భావాన్ని ఎంత చక్కగా రాశారో మనసు కవి...

పెళ్ళికానుక సినిమాలోని ఈ పాట ఎంత హాయిగా ఉంటుందో వినడానికీ, వీక్షించటానికీ! సరోజా దేవి గారెంత అందంగా ఉన్నారు లంగా-వోణీలో, కుర్రప్రేమికుడి అమాయకత్వాన్ని అభినయాల్లో ఎంతబాగా చూపారో నాగేశ్వరరావు గారు. సాగరతీరాన వారు వ్యవరించే తీరుచూడండి... ప్రపంచంలో ప్రేమకన్నా ఆనందం కలుగజేసేది వేరేదుందా లోకంలో అనేటట్టులేదూ?

అతడు :
వాడుక మరచెదవేల, నను వేడుక చేసెదవేల?
నిను చూడని దినము నాకొక యుగము
నీకు తెలుసును నిజము
ఆమె :
వాడుక మరువను నేను, నిను వేడుక చేయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము

చరణం 1
అతడు :
సంధ్య  రంగుల చల్లని గాలుల 

మధుర రాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు 

మరిచిపోయిన వేళ?
ఇక మనకీ మనుగడ ఏలా?
నీ అందము చూపి డెందము వూపి 

ఆశ రేపెదవేలా? ఆశ రేపెదవేలా?

ఆమె :
ఓ ఓ ఓ...సంధ్య రంగులు సాగినా, చల్లగాలులు ఆగినా
కలసి మెలసిని కన్నులలోన, మనసు చూడగలేవా?
మరులు తొడగగ లేవా?

చరణం 2
అతడు :
కన్నులా ఇవి కలల వెన్నెలా,  చిన్ని వన్నెల చిలిపి తెన్నులా?
మనసు తెలిసీ మర్మమేలా?

ఆమె :
ఇంత తొందర ఏలా ఇటు పంతాలాడుట మేలా?
నాకందరికన్నా ఆశలు ఉన్నా హద్దు కాదనగలనా?
హద్దు కాదనగలనా?

వాడని నవ్వుల తోడ నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లోకము మరిచి
ఏకమౌదము కలసి ఏకమౌదము కలిసి

రచన : ఆత్రేయ
చిత్రం : పెళ్ళి కానుక
సంగీతం : ఏ ఎం రాజ
గళం : ఏ ఎం రాజ, సుశీల
దర్శకత్వం : శ్రీధర్


నా ఫైనల్ టచ్ :
=======
ఎంత అద్భుతమైన భావాలున్నాయో ఈ పాటలో...
ఆమె అందానికి ఆయన గారి హృదయం ఊగిపోతుందట. డెందమన్న పదాన్ని ఎంతబాగ వాడారో ఆత్రేయ.

ఆవిడ ప్రశ్న వినండి,
"సంధ్య రంగులు సాగితేనేమి, చల్లగాలులు ఆగితేనేమి? కలిసి మెలిసి ఉంటూ, కన్నుళ్ళో నా మనసు గ్రహించుకోలేవా, మరులు తోడుకోలేవా?"
అందుకు ఆ ప్రియుని జవాబు ఇంకా బాగుంది చూడండి,
అవి కన్నులు కాదు, కలల వెన్నెలలు. ఈ వన్నెలకారి చిలిపి తెన్నులవి. నాకేం కావాలో నీకు తెలిసికూడా ఏం తెలియనట్టు నటిస్తున్నావ్ అంటున్నాడు.

ప్రియుని మాటలకి ఆవిడ ఓదార్పుగా ఇలా అంటుంది,
ఊరకే ఎందుకు పంతాలాడుతావు, నీమీద పంచప్రాణాలుపెట్టుకు జీవిస్తున్నాను. అందుకని హద్దుకాదనగలనా? అని ఓదార్చుతుంది.

ఇద్దరు కలిసి ఇలా శుభం పలుకుతున్నారు చివర,
ఎన్నటికీ వాడిపోని చిరునవ్వులతో, నడిచే పువ్వుల్లా ఇద్దరి అనురాగాలతో లోకంలో మనమిద్దరమే ఉన్నట్టు భావిస్తూ కలిసి బ్రతుకుని ఆనందంగా సాగిద్దాం అంటున్నారు.

ఇలాంటీ గీతాలను వింటూ రోజుని మొదలుపెడితే ఆ రోజంతా చాలా పాసిటివ్ గా, active గా గడిచిపోతుంది. 


======================
Lyrics in RTS format
======================
   pallavi 
 

    ataDu :
    vADuka marachedavEla, nanu vEDuka chEsedavEla?
    ninu chUDani dinamu nAkoka yugamu
    neeku telusunu nijamu
    Ame :
    vADuka maruvanu nEnu, ninu vEDuka chEyaga lEnu
    ninu chUDani kshaNamu nAkoka dinamu
    neeku telusunu nijamu

    charaNaM 1
    ataDu :
    saMdhya  raMgula challani gAlula
    madhura rAgamu maMjula gAnamu
    tEne viMdula teeyani kalalu
    marichipOyina vELa?
    ika manakee manugaDa ElA?
    nee aMdamu chUpi DeMdamu vUpi
    ASa rEpedavElA ASa rEpedavElA

    Ame :
    O O O...saMdhya raMgula sAginA, challagAlulu AginA
    kalisi melisi kannulalOna, manasu chUDagalEvA?
    marulu toDagaga lEvA?
 
    charaNaM 2
    ataDu :
    kannulA ivi kalala vennelA,  chinni vannela chilipi tennulA?
    manasu telisee marmamElA?

    Ame :
    iMta toMdara ElA iTu paMtAlADuTa mElA?
    nAkaMdarikannA ASalu unnA haddu kAdanagalanA?
    haddu kAdanagalanA?

    vADani navvula tODa naDayADeDu puvvula jADa
    anurAgamu virisi lOkamu marichi
    Ekamaudamu kalasi Ekamaudamu kalisi
 
rachana : AtrEya
chitraM : peLLi kAnuka
saMgeetaM : E eM rAja
gaLaM : E eM rAja, suSeela
darSakatvaM : Sreedhar

====================================

26 జులై 2011

తీరం చేరుకోలేని అలలు...


నిద్రపోనివ్వని రాత్రులెన్నో
పనిచేసుకోనివ్వని పగళ్ళెన్నో!

కాలాలు నీ జ్ఞాపకాల నెమరుతో కరిగిపోతున్నాయ్...

భూమి ఆకశదుప్పటి కప్పుకున్నా,
తూట్లుపెట్టుకుని తొంగిచూసే కోట్లాది నక్షత్రాలవలే
మనసుకెందరు ఓదార్పు దుప్పట్లు కప్పినా దూసుకొచ్చే నీ జ్ఞాపకాలు!
చేరువలో గారమైన మనసు; దూరములో భారమైనది!

నీ పరిచయము పంచిన
లెక్కలేని తీపి అనుభవాలూ
చేసిన ఏకైక మధురగాయమూ - ఈ జన్మకు ఒకసారే!

ఇకపైనా తీపి అనుభవాలు రావచ్చు;
మధుర గాయాలు తగలవచ్చు - వాటి ఆధిక్యత ఇంతలా ఉండదు.

సున్నితత్వాన్ని అమ్ముకోలేక, దృఢత్వాన్ని కొనుక్కోలేక
బ్రతుకువాణిజ్యం ఎలాకొనసాగించాలో?

నా శ్రేయోభిలాషులు అంటున్నారు -
నీ జ్ఞాపకాలను దూరం చేసుకుంటే హాయిగుంటానట...
వాళ్ళకెలా చెప్పను?
నిన్ను మరవడమూ, మరణించడమూ ఒకటే నాకు అని?

నాలాంటి మంచి మనిషిని నువ్వే పోగుట్టుకున్నావట -  అందరు ఓదారుస్తున్నారు.
నిజానికి నిన్ను నేనో; నన్ను నువ్వో కాదు కదా పోగుట్టుకున్నది?
బ్రతుకు క్యాన్వాస్పై మనమిద్దరం కలిసి గీసుకోవాలనుకున్న
స్వచ్ఛమైన ఊహా చిత్రాన్ని పోగుట్టుకున్నాం!

నన్ను కావాలనుకున్నప్పుడు ఎందుకని అడగలేదు!
నన్నొద్దనుకున్నప్పుడు ఎలా అడగను?
నీ నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరించడమే
నేను నీకు ఇవ్వగల చివరి కానుక!

ప్రతి అలకూ ధ్యేయం తీరం చేరడమే -
అయితే ప్రతి అలా తీరం చేరుతుందా?
తీరం చేరేముందే మఱో పెద్ద అల మింగేసిన చిన్న కెరటంలా
మరణానికి గురైనవి మన ఆశల కెరటాలు!

 ఆ కెరటాలు నిజం; వాటి ధ్యేయం నిజం;
తీరం చేరే ముందే వాటిని చేరిన మరణం కూడా నిజమే!
=============================================

30 జూన్ 2011

180 "ఈ వయసిక రాదు" - తెలుగు సినిమా విశేషాలు!


నిన్న రాత్రి, 180 అనే తెలుగు సినిమాకెళ్ళాం.  ఈ సినిమాని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో తీశారు.  ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. 
 

సిద్ధార్థ్, నిత్యా మేనన్, ప్రియ ఆనంద్, గీత, మౌళి, తనికెళ్ళ నటించారు. జయేంద్ర దర్శకత్వం.  సభ్యమైన సినిమా. మొదలైన కొన్ని నిముషాలకే కథ మొత్తం ఊహించేయొచ్చు. కథ తెలిసిపోయింది ఇక కుతూహలం ఏముంటుంది అనుకోడానికి లేదు. యువతకు తప్పక నచ్చే ప్రేమ కథ. యువతకు నచ్చుతుంది అన్నానని ఇది కుర్రకారు మాత్రమే చూడతగ్గ సినిమా ఏం కాదు. పెద్దవాళ్ళుకూడా హాయిగా నవ్వుకోగలరు. సంభాషణల్లో శ్లేషార్థాలూ లేవు, ముఖంమొత్తే దృశ్యాలూ లేవు. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు.

సమయం ఎలా గడిచిందో తెలిసేముందే అర్ధం సినిమా నవ్వుల మధ్య అయిపోతుంది. రెండో సగంలో కథ అమెరికాకి వెళ్ళిపోతుంది.  ఇంతకన్నా ఎక్కువగా రాసేందుకు కథలేదు. చిన్న కథని రెండున్నర గంటలు ఎలా చూపారు? 180 అని పేరెందుకు పెట్టారు. ఆ 180 కి అర్థం ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడవలసిందే.

సిద్ధార్థ్ :
కథంతా ఇతని చుట్టూనే తిరుగుతుంది. ఎప్పట్లాగా బాగనే నటించాడు.

మౌళి :
సంభాషణలను తనగళంతోనే పలికించారు. మంచి హాస్యం ఒలికించారు. ఒకప్పుడు ఈయన ఎన్నో గొప్ప హాస్య చిత్రాలను తీశారు. మంచి దర్శకుడు.

గీత : 
బాలచందర్ బడిలో నటన నేర్చిన ఈమెకు ఇదేం కష్టమైన పాత్రకాదు. బాగ చేశారు. ఈమెకూడా స్వయగళంలోనే సంభాషించారు.

నిత్యా మేనన్ :
అల్లరి పిల్ల పాత్రలో అల్లరి చేస్తూ, నవీన దుస్తుల్లో నవ్వుతూ నటించింది.  ఈ మళయాళపు కుట్టి కొంచం సన్నగా ఉంటే బాగుండేది. పొట్టివల్లనో ఏమో చీరలో వచ్చే (ఒకేయొక) సన్నివేశంలో అంత బాగా అనిపించలేదు.  ఈమెకి ఇంకా ఇంకా సినిమాలు చెయ్యాలనే ఉద్ధేశం ఉంటే ఒకటి సన్నబడాలి, లేకుంటే ఇంక కాస్త లావెక్కాలి. సన్నబడితే తెలుగు సినిమాలు! లావెక్కితే తమిళ సినిమాలు :P


ప్రియ ఆనంద్ :  
హమ్మయ్యా, ఎంత బాగుందో ఈ అమ్మాయి. అమెరికా అమ్మాయి పాత్రకు బాగా ఇమిడింది. పాత్రకు కావలసిన భావాలను సహజంగా ప్రదర్శించింది. దుఃఖకర సన్నివేశంలో ఎక్కడ అతి చేస్తుందో అనుకున్నా, అసలు లేదు. సహజంగా నటించింది.  సినిమా మొదటి సగంలో నిత్య ని చూసిన ప్రభావం వల్ల రెండో సగంలో వచ్చే ప్రియ ఆనంద్ అందంగా, సన్నగా కనబడుతుందేమో అని పొరబడేరు. అలాంటిదేమీ లేదు. నిజంగానే ప్రియ ఆనంద్ సన్నగా బాగుంది.  ఇంక కొంతకాలం మన తెలుగు యువకులకి ప్రియ జ్వరం ఉంటుంది. 







సంగీతం :  
శరత్ సంగీతం అందించారు. మళయాళపు వ్యక్తి కాబట్టో ఏమో పాటల్లో ఎక్కడా తెలుగుదనం కనబడలేదు. సాహిత్యం తెలుగే అయినా అరవంలాగా వినబడుతుంది. ఈ సినిమాకు సంగీతం పాటల పరంగా ఒక ఊనమే (మైనస్ పాయింట్?) అయింది.  నేపద్య సంగీతం బాగనే ఉంది. ఈ సినిమా పాటల గురించి రెణ్ణెళ్ళ క్రితం V B  సౌమ్యా గారన్న మాటలు గుర్తు తెచ్చుకుందాం  “ఏవిటో, ఈ సంగీత దర్శకుడి బాధ... దారి తెలీక వెదుక్కుంటున్నప్పుడు కలిగే అయోమయం గుర్తొస్తోంది నాకు. ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే గానీ, అలాంటి సంగీత దర్శకుడూ, గాయకుడూ రారు - తెలుగుకు. భావి తరాలకి గొప్ప ఆదర్శ జీవి ఆ గాయకుడు మాత్రం.”

కథ, మాటలు, దర్శకత్వము :
పెద్ద కథేం కాదు. కథ మొత్తం నాలుగు మాటల్లో చెప్పేయచ్చు. అంత చిన్న కథని రెండున్నర గంటలసేపు విసుగెత్తించకుండ చూపడంలోనే దర్శకుడి ప్రతిభ తెలిసిపోతుంది.  కథనమూ (స్క్రీంప్లే), తమిళ మాటలూ ప్రముఖ తమిళ రచయితలు సుబా (స్రేష్ & బాలకృష్ణన్) గార్ల ది. తెలుగు మాటలు రాసినది ఉమర్జి అనురాధ, సుబా గార్ల క్లుప్త(crispy) సంభాషణా శైలీలోనే తెలుగుపదాలు రాశారు! బాగున్నాయ్.  చిత్రీకరణలో బాగా శ్రద్ద తీసుకున్నట్టున్నారు.

చివరి మాట : సమయం ఉంటే ఒక సారి చూడచ్చు. తప్పక చూడవలసిన చిత్రమైతే కాదు.