23 ఏప్రిల్ 2014

ప్రేమ డైరీ - 005

డియర్ చెల్లం,

"నీ పలుకుల తొలి కిరణాలు సోకకుంటే  మనసుకి పొద్దు పొడవదు." - ఫోటో వెనుక నువ్వు రాసిన మాటల్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నిన్ను చూస్తూ ఉన్నాను.

నా చీకటి జీవితాన్ని వెలుగులతో నింపేసినవి ఈ కళ్ళేనా? ఈ చిన్ని పెదాలేనా నా ప్రాణాన్ని తాగేయాలని తహతహలాడేవి? ఆ చూపులు చూడు! నాకంటూ నన్ను మిగల్చకుండ దోచుకెళ్ళాలనే ఆత్రం! హృదయాన్ని తాడుకట్టి "భావ"సాగరం చిలికేస్తున్నది నీవేనా? 

పూర్వ కవులెందరో రాసిన ప్రణయ భావాలన్నీ వట్టి మాటలుకావని నేర్పావు. లేని నా రాకుమారికై ఏకాంతంలో నేను అల్లుకున్న కలలహారాలు నీకెలా దొరికాయి? హారాలకు మరింత అందం చేకూరేలా అలంకరించుకుని నా వలపు వాకిట ఎదురొచ్చావు!

మనం పరిచయం అయిన తొలి రోజులు - అలా అలా మాయమాటలేవో చెప్తూ కంటికి కనబడే దూరంలోనే ఆగిపోతావు. అచ్చంగా బయటపడనేపడవు! చున్నీతో ఎదను కప్పేసినంత సులువుగా మొండితనంతో మనసుని కప్పేసుకుంటావు. ఇంత ఆత్మనియంత్రణనెలా అలవరుచుకున్నావో! ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. నువ్వు చెప్పినవాటివల్లకన్నా, దాచిన వాటివల్లే నీ మనసునెక్కువగా అర్థంచేసుకున్నాను. నీ మాటలకంటే నీ మౌనాలే ఎక్కువ చెప్తాయి నీ భావాలేంటో అని! 

మంచుముద్ద అమ్మాయిరూపందాల్చినట్టు ఉంటావు. గాఢనిద్రసమయం మినహాయించి మిగిలిన అన్ని క్షణాల్లోనూ ఏదో ఒకరకంగా నిండిపోయుంటావు. ఏకాంతంలో చిలిపితలపులుగా, ప్రేమపొంగినపుడు భావాల తరంగాలపై ఉయ్యాలూపే చిరుగాలిగా, మనోవికార సమయాల్లో జోలలుపాడే తల్లిగా!  

పవలూ, రేయీ తేడా లేదు నీ మాయలో. కళ్ళు తెరుచున్నంతసేపూ చుట్టూ కాంతే తప్ప చీకటికి తావేలేదు.

నడిచే దారుల్లో ఊగే కొమ్మల్లోని లేత ఆకులన్నీ నీ బుగ్గల్ని గుర్తుచేస్తాయి. పువ్వులమ్మే ముసలావిడ తట్టనెత్తినబెట్టుకుని వస్తుంటే తొంగి చూసేమల్లెపూలు నీ కురులను తలపిస్తాయి. తొలిచినుకులు నేలతాకగానే వచ్చే మట్టివాసన నీ చేతులుపట్టుకున్న జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. నీ నవ్వులు విన్నప్పుడల్లా అప్పటికప్పుడు నా చుట్టూ రోజావనం! రంగురంగుల గులాబీలు.

నా పాలిట వరానివా? శాపానివా?

వరాలుగా ఎన్నో తీయని క్షణాలున్నాయి, అలరించే జ్ఞాపకాలున్నాయి.

కొన్ని శాపాలు తప్పవా? ఇన్నీ ఉన్నా... దగ్గరగా తీసుకుని నీ పెదాలలో నా ప్రాణంపోసి, పులకించిపోయే క్షణం రాదు. ఒడిజేర్చుకుని నీ ఏడుపుని నా కళ్ళతో ఏడ్చి నీ వేళ్ళతో ఓదార్పుని అందుకోవడం కుదరదు. నా చేతి రేఖలు నీ వంపుల్లో ముద్రలుగా నిలిచిపోయే తారీఖెప్పుడూ?


* * * * * * * * * * * * * * * * * * * * * * * 

11 ఏప్రిల్ 2014

ప్రేమ డైరీ - 004

నల్లోడా,

వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చావని 

వెళ్తూ ప్రతిసారీ నా ప్రాణాలు తీసుకెళ్తావ్?
ఈ కొండంత విషాదం కన్నీళ్ళుగా కరిగేదెప్పుడో!
తిరిగి నే మనిషినయ్యేదెపుడో!
 

రెండురోజులింత తొందరగా గడిచి పోతాయి అనుకోలేదు. ఈ కొన్ని జ్ఞాపకాలను మళ్ళీ నువ్వు వచ్చేంతవరకు పదిలపరుచుకోవాలి. 

సోమేశ్వరుడు గుళ్ళో దణ్ణం పెట్టుకున్నప్పుడు నీ పక్కన నిల్చున్నాను. బొట్టుపెట్టాలని చేయి తెగ ఆరాటపడిపోయింది. ప్రదక్షిణం చేసేప్పుడైనా నిన్ను దాటుకునే వంకతో అలా తాకించి వెళ్ళిపోవాలనుకున్నాను. కుదర్లేదు... నువ్వూ కుదుర్చుకోవాలనుకోవు... మొద్దు రాచ్చిప్పవి... కొండదిగేప్పుడు పిలవని చుట్టంలా వచ్చిన వాన చినుకుల్లో తడిసిపోయాము. వర్షని గుండెలకు హత్తుకుని వాళ్ళమ్మ దాని తల తుడుస్తుంటే నిన్ను కూడా అలా లాక్కుని నీ తల తుడవాలనిపించింది. నువ్వు వేళ్ళతో తల తుడుచుకుంటుంటే నేను చున్నీ చేతబట్టుకుని మౌనంగా చూస్తూ ఉండిపోయాను. నీ తలనుండి చెదిరిన చుక్కలు నా మొహంమీద పడ్డాయి. నువ్వే తాకినంత పులకింత! 

తెలుసా వర్షకి అన్నీ నీ పోలికలే. మేనమావ పోలికలెక్కడికి పోతాయిలే! రంగు మాత్రమే వాళ్ళ నాన్నది. కళ్ళూ, ముక్కూ, నుదురు, పొడవాటి వేళ్ళూ, బుగ్గలూ, పెదవులూ... దానికి ఎన్ని ముద్దులు పెట్టేశానో! నిన్నెప్పుడు ముద్దు పెట్టుకుంటాను?


* * * 

07 ఏప్రిల్ 2014

పాత సూత్రంలో కొత్త ముడులు పడవా?

"జీవితం వృత్తంలాంటిది, మరి ముగిసినచోట మళ్ళీ మొదలయ్యేనా?"
అభిప్రాయభేదాలతో విడిపోయాయి ఆ జంట పక్షులు. ఒంటరితనాన్ని మోసుకుంటూ ఆలోచనల ఆకాశంలో ఎగురుతున్నారు. వియోగంలోని బాధ భేదాలను క్షమించమని బ్రతిమాలుతుంది. "శహన"లో ఈ అందమైన అరవ సాహిత్యాన్ని ఆస్వాదించండి.


https://www.youtube.com/watch?v=eZa4H7EUF5Y - Tamil Version (Vairamuthu Lyrics)
https://www.youtube.com/watch?v=5aP2cjg-9FQ -  Telugu version (AM Ratnam Lyrics)

సాహిత్యం : వైరముత్తు  
Here is my loose translation of original lyrics
అతడు :
ప్రియా కుశలమా
నీ కోపాలు కుశలమా
కంటిపాప కుశలమా
కంటనీరు కుశలమా

బుగ్గలు రెండూ కుశలమా
వాటిపై నా చివరి ముద్దులు కుశలమా
నీ పానుపు కుశలమా
(పరుపైన) ఒక్క తలగడా కుశలమా
ఆమె :
ప్రియా కుశలమా
నీ తాపాలు కుశలమా
సఖుడా కుశలమా
నీ ఒంటరితనం కుశలమా
ఇల్లు వాకిలి కుశలమా
ఇంటితోట కుశలమా
పువ్వులన్నీ కుశలమా
నీ అబద్ధాలు కుశలమా
కిటికీ చువ్వలకంటుకున్న
నా కన్నీటిచుక్కలు కుశలమా
నీ ఇంటి మండువాలో వినిపించే
నా పట్టీల సవ్వడి కుశలమా

అతడు :
ప్రియా నిన్ను విడాను
నా చిత్తం చెడిపోయాను
వెలుగులో ఏడిస్తే నామోషీయని
దీపాలు ఆపేసి ఏడ్చాను

ఆమె :
ప్రియా నిన్ను ద్వేషించి
నా తెలివితేటలను తగలబెట్టాను
బంధం విలువ వియోగంలో గుర్తించి
సగంప్రాణం అయ్యాను
అతడు :
పాత దండల్లో కొత్తపువ్వులు పూయవా?

ఆమె :
పాత సూత్రంలో కొత్త ముడులు పడవా?
అతడు :
జీవితం వృత్తంలాంటిదైతే
ముగిసినచోట మళ్ళీ మొదలవ్వదా?

------------------
గాయకులు : శ్రీనివాస్, సాధనా సర్గం
సంగీతం : AR Rahman (రహ్మాన్)
చిత్రం : పార్తాలే పరవశం ( తెలుగులో : పరవశం)
డైరెక్టర్ : K.Balachander

--------------------
Tag Words : Tamil Lyrics - Telugu translation, anbe sugama song, cheliyA kuSalamA, చెలియా కుశలమా, పరవశం, పార్తాలే పరవశం, parthale paravasam